శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:37 IST)

జగన్‌కు షాక్.. వైకాపాకు మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్‌‍బై

alla nani
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని వైకాపాకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రటించారు. ఈయన గత వైకాపా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖామంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. 151 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి.. ముగిసిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లను కూడా దక్కించుకోలేక పోయారు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా వైకాపాకు చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పి. దొరబాబు పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది జరిగి 48 గంటలు కూడా గడవకముందే మరో మాజీ ఎమ్మెల్యే టాటా చెప్పేశారు. 
 
ఏలూరు జిల్లాకు చెందిన కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. 
 
జగన్ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణయ్య చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు ఏకంగా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. కాగా, ఈయన టీడీపీ లేదా జనసేన పార్టీల్లో చేరే అవకాశం ఉంది.