శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (08:20 IST)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ - జనసేన నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలి అనేది బీజేపీ - జనసేన నిర్ణయం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజధానిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డాతో  పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.

గంటసేపు సాగిన ఈ ప్రత్యేక భేటీలో రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కి నడ్డా కృతఙ్ఞతలు తెలిపారు.  

భేటీ అనంతరం విలేకర్లతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "నడ్డా ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి వచ్చాము. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను బీజేపీ జాతీయ అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లాం. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఉద్యమంపై చర్చించాం. బీజేపీ, జనసేన కూటమి చివరి రాజధాని రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది.

ఇవి నా మాటలు కాదు, నడ్డా నోటి నుంచి వచ్చిన మాటలివి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నడ్డా దృష్టిలో ఉంచాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పి సమస్యాత్మకంగా ఉంది. దేవాలయాలను అపవిత్రం చేయడంతోపాటు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రథాలు దగ్ధం చేశారు. ఈ పరిణామాలను వివరించాం.
 
తిరుపతి ఉపఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి? ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలా అనేది త్వరలో వెల్లడిస్తాం.  ఈ అంశంపై సంయుక్త కమిటీ వేసి... కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి" అన్నారు.   

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "పోలవరం ప్రాజెక్టు, అమరావతి విషయంలో కేంద్రం చాలా స్పష్టతతో ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరాం. సానుకూలంగా స్పందించి కేంద్రం బాధ్యత తీసుకొంటుందని.. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పించండని మాతో చెప్పారు.

ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలిగానీ... నాయకులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు చేయకూడదు. రాష్ట్రం ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాలు గురించి వివరాలు సేకరించే బాధ్యత కేంద్రానికి ఉంది. కాబట్టి ఆ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని, ఇదే మా నిర్ణయమని నడ్డా చెప్పారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా.. ఇష్టానుసారం మార్చేస్తాం అంటే కుదరదని తెలిపారు.  రాజధాని ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోరాటం చేస్తాయి ఆ భరోసా రైతులకు ఇవ్వండి అని చెప్పారు.

రాష్ట్ర రాజధాని అమరావతి అనేది మా పార్టీ స్టాండ్.  రాజధానిలో రైతుల పక్షాన పోరాడాలని నిర్ణయించింది. అదే విధంగా బీజేపీ నాయకులు జనవరి 11న  రైతుల పక్షాన పోరాడాలని తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలను మోసగించే విధంగా రాజధాని మార్చకూడదు. దీనిపై కలిసి పోరాడాలని నిర్ణయించాం" అన్నారు.