ఏపీని అప్పుల కుప్పగా మార్చిన వైకాపా.. పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైకాపా పాలకులు అప్పుల కుప్పగా మార్చేశారని బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. విశాఖ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులను వైకాపా పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రతి వర్గానికి, నిరుపేదకు మేలు చేకూర్చేలా ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.
కరోనా సమయంలో దేశంలో 15 కోట్ల మంది చనిపోయే అవకాశముందని అనేక సంస్థలు హెచ్చరించాయని, కానీ, మోడీ దార్శనికతతో కోట్లాది మంది ప్రాణాలు రక్షించారన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా, అత్యంత వేగంగా టీకా అందించారని గుర్తు చేశారు. గతంలో అతి పెద్ద ఆర్థిక శక్తి కలిగిన జాబితాల్లో దేశం 11వ స్థానంలో ఉంటే ప్రస్తుతం ఐదో స్థానానికి చేరిందని, రానున్న రోజుల్లో మూడో స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని, అన్ని రంగాల్లో అవినీతి పెరిగి పోయిందని, చివరికి జీతాలు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే, వైసీపీ ప్రభుత్వం ఎన్ని పూర్తి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.