1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (19:24 IST)

రామతీర్ధానికి భాజపాను అహ్వానించాల్సిందే : సోమువీర్రాజు డిమాండ్‌

రామతీర్ధం ఆలయానికి వెళ్లేందుకు భాజపాను ఆహ్వానించేవరకు ఉద్యమం కొనసాగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భాజపా- జనసేనలు సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన రామతీర్ధం ధర్మయాత్రను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన నిర్వహించారు.

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదురుగా బుధవారం నిర్వహించిన  కార్యక్రమంలో పాల్గొన్న సోమువీర్రాజు మాట్లాడుతూ,  హిందూధర్మంపై వరుసగా దాడులు జరుపుతున్న అచారకశక్తులను అదుపుచేయని రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా దైవ సందర్శనానికి వచ్చిన తమను నిర్బందించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
\
18 నెలల నుంచి హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడాన్ని బట్టి ఈ అరాచకాలను  ఆయనే ప్రోత్సహించినట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. ఈ విధానం సమాజంలో మత ఘర్షణలకు ప్రేరేపించేలా ఉందన్నారు.

దేవునిపట్ల జరిగిన అపరాచారానికి దు:ఖిస్తూ, ఆవేదనతో చూడటానికి వెళ్తున్న భాజపా అసంఖ్యాక కార్యకర్తలను చూసి భయపడ్డ డీజీపీ, ముఖ్యమంత్రి కూడగట్టుకుని తమను నిర్భందించారని మండిపడ్డారు. భాజపా హిందుత్వ పార్టీ అని, హిందువులకు, హిందూధర్మం, సంస్కృతులకు విఘాతం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు.... 
 
హింతువులకు మద్దతు ఇస్తున్నిరనే అక్కసు, భయంతో రాష్ట్ర ప్రభుత్వం భాజపా, జనసేనలను రామతీర్దం రానీయకుండా నిర్బందించింది. ఈ ఆలోచనలను భాజపా ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు అంశాలపై భాజపా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తుంది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది.

80 శాతం హిందువులున్న రాష్ట్రంలో నిరంతరం దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా నోరువిప్పి మాట్లాడకపోవడం హిందుత్వంపై ఆయన వైఖరేమిటో చెబుతోంది. భాజపా హిందువుల పార్టీ అని బహిరంగంగా చెబుతున్నాం. ఇందులో రెండో ఆలోచననకు తావులేదు. అంతమాత్రాన మేం క్రైస్తవులు, ముస్లింలకు వ్యతిరేకం కాదు.

మా కోర్‌ అజెండా హిందూత్వమే. దీని కోసం మేం పోరాడతాం. కొందరు రాముడు మీవాడా అని అంటున్నారు. అవును మావాడే. పురుషోత్తముడైన రామునికి ఆలయాన్ని అయోధ్యలో నిర్మించేది భాజపానే. ఇది చంద్రబాబు, జగన్‌ కట్టగలరా? మా ఆలోచన, త్రికరణశుద్దికి ప్రజలే నిదర్శనం. రాజకీయ వ్యబిచారం చేస్తున్నట్లు కొందరు పిచ్చికూతలు కూస్తున్నారు.

మాకు అలాంటి అవసరం లేదు. కొందరు వ్యభిచారులు రాజకీయ పార్టీల్లో  కొనసాగుతున్నారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబులను ఎలా ఆహ్వానించారు. అలాగే భాజపాని ఆహ్వానించాలి. దీనికెందు ఇబ్బంది...భయం. మీ మనసులో గుబులుపుడుతుందా? పోలీసులు... వారి ఉన్నతాధికారికి గుబులుపుడుతుందా? భాజపాని నిరోధించాలని జగన్‌, డీజీపీ సవాంగ్‌ ఇద్దరూ మాట్లాడుకున్నారా? మమ్మల్ని మీరు ఎలా ఇబ్బందిపెట్టినా మమ్మల్నేం చేయలేరు.

చైనా, పాకిస్దాన్‌లను, తీవ్రవాదులను, నక్సలైట్లనే మేం ఎదుర్కొంటున్నాం. మిమ్మల్ని చూసి భయపడం. కేరళలో భాజపా కార్యకర్తలను, సంఘ్‌ సభ్యులను హతమారుస్తున్నారు. మమతా బెనర్జీ వందలమంది బాజపా కార్యకర్తల మరణానికి కారణమైంది. మేం బెదరం. జగన్‌ రాజకీయాలకు భాజపా సరైన సమాధానం చెబుతుంది. మేం వెనుకంజవేయం. ప్రభుత్వ , ప్రజాప్రతినిధుల అవినీతి, అచారకం, ప్రజా వ్యతిరేకవిధానాలపై భాజపా పోరాడుతుంది.

ఈ ఉద్యమాలు ఆగవు... దమ్ములేని ప్రభుత్వం
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ, రామతీర్దం ఆలయం సందర్శనానికి భాజపాను అనుమతించకపోతే ఏర్పడే పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందువులు,  ఆలయాలపై దాడులు జరుగుతుంటే నేరస్తులను పట్టుకోలేని దమ్ములేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు.

చేతకాని దేవాదాయ శాఖమంత్రి, నిరాటంకగా బూతులు మాట్లాడే మంత్రులు, అరాచకాన్ని సమర్ధిస్తూ, వైకాపా నేతల సేవలో తరించే పోలీసు బలగాలతో ఈ ప్రభుత్వం బ్రష్టుపట్టిపోయిందన్నారు. కార్యక్రమంలో భాజపా పూర్వ అధ్యక్షులు డా||కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
 
విజయవాడలో : 
రామతీర్ధం వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్‌లో భాజపా విజయవాడ పార్లమెంటు అధ్యక్షులు బబ్బూరి శ్రీరాం అధ్యర్యంలో ధర్నాజరిగింది.  కార్యక్రమంలో పాల్గొన్న భాజపా, జనసేన నాయకులు పాల్గొని ధర్మయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న భాజపా, జనసేన నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ... రాష్ట్రంలో యధేచ్చగా ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే దోషులను పట్టుకోక  హిందువులను అవమానిస్తుందని  మండిపడ్డారు. ఆలయాలు, దేవతల విగ్రహాలు ధ్వంసమైతే ఆందోళన చెందుతూ రోడ్డెక్కిన భాజపా కార్యకర్తలను  నిర్బందించడం ప్రభుత్వ అరాచకం కాదా అని ప్రశ్నించారు. దోషులను పట్టుకోలేని ప్రభుత్వానికి మమ్మల్ని నిర్బంధించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.  జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికార మదంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ఆలయాలపైన దాడులను అరికట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, విజయవాడ పార్లమెంటు ఇన్‌చార్జి పాకా సత్యనారాయణ, భాజపా కార్యకర్తలు, జనసేన నాయకులు పోతిన మహేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.