గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:37 IST)

నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్... జి.కొండూరులో భూప్రకంపనలు

అనుమ‌తులు లేకుండా రిగ్ బ్లాస్టింగుల‌తో జి.కొండూరు మండ‌లం ద‌ద్ద‌రిల్లిపోతోంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోని క్వారీలలో నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా లోతైన రిగ్ లు వేసి భారీగా పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్టింగ్ చేయడం వల్ల దాదాపు ఐదు నుంచి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న భవనాలు సైతం బీటలు వారుతున్నాయి. అధికారులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఇదంతా బహిరంగ రహస్యం అయినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రిగ్ బ్లాస్టింగ్ కు మాత్రం అధికారులు కళ్లెం వేయలేకపోతున్నారు.

జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు లోయ, చెవుటూరు గ్రామ శివారులో ఉన్న  క్వారీలు దక్కించుకున్న వారు, లీజు దారులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారు. భారీ ఎత్తున రిగ్ బ్లాస్టింగ్ లు చేస్తూ ఖనిజ సంపదను కొల్ల గొడుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. అటు మైనింగ్ శాఖా అధికారులు గానీ, ఇటు రెవిన్యూ శాఖా అధికారులు గాని పట్టించుకోక పోవడంతో కోట్లకు పడగెత్తుతున్న క్వారీల నిర్వాహకులు వారి వారి పనులు చక్కబెట్టుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు మైనింగ్, రెవిన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొంత మంది అవినీతి అధికారుల కారణంగానే ఈ విధంగా జరుగుతుందని అని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. 
 
జి.కొండూరు మండలంలో సుమారు 40కి పైగా గ్రానైట్, గ్రావెల్  క్వారీలు ఉన్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిలో కొన్ని క్వారీలకు అనుమతులు, రెన్యూవల్స్ లేవని మైనింగ్ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ పరిధికి మించి గ్రానైట్ క్వారీలను ఆక్రమించి ఖనిజ సంపదను కొల్లగొడుతున్నట్లు వారు వాపోతున్నారు. ఒకే పరిమిట్ పై పదుల సంఖ్యలో లారీలు తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాయల్టీ చెల్లించకుండా వారి వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక సమగ్రమైన విధానం లేని కారణంగానే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని మేధావులు పేర్కొంటున్నారు. గ్రానైట్ క్వారీలలో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే బ్లాస్టింగ్ లు చేయాలి. అలా కాకుండా క్వారీలలో పనిచేసే కార్మికులతోనే బ్లాస్టింగులు చేయిస్తున్నారు. నైపుణ్యం లేని సిబ్బందిని వాడటం వలన అక్కడ పనిచేసే వారికి కూడా ప్రాణాపాయం ఉంది.
 
ముఖ్యంగా రిగ్ బ్లాస్టింగ్ లు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. గ్రానైట్ క్వారీల నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా రిగ్ బోర్ వేసి బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఇలా బ్లాస్టింగ్ చేయడం వల్ల సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో భూమి ఒక్కసారిగా కంపిస్తుంది. భూ ప్రకంపనలు కారణంగా భవనాల గోడలు బీటలు వారుతున్నాయి. భారీ శబ్దాలతో లక్షలు వెచ్చించి నిర్మించుకున్న భవనాలు రిగ్ బ్లాస్టింగ్ లతో దెబ్బ తింటున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. గుండె సంబంధిత రోగాల బారిన పడిన వారు ఆ శబ్దాల కారణంగా మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
 
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ మైనింగ్, గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న క్వారీ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ గైడెలైన్స్ ప్రకారం క్వారీలు నడుపుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని కొందరు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించని కారణంగా ప్రజలు నష్టపోతున్నారు.