మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (10:32 IST)

భ‌విష్య‌త్తు ఐటీ రంగానిదే...

బ్లిట్జ్ క్రీగ్ -2022 పేరుతో ఇంజ‌నీరింగ్ విద్యార్థులు సంద‌డి చేశారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో బ్లిట్జ్ క్రీగ్ పేరుతో నిర్వహించిన అంతర్ కళాశాలల సాంకేతిక, సాంస్కృతిక పోటీలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి.  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ఆధ్వ‌ర్యంలో ఈ పోటీల ప్రారంభోత్సవానికి హెచ్‌సీయల్ టెక్నాలజీస్ హెచ్.ఆర్. డైరెక్టర్ శాంసన్ ప్రేమ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్ధులకు సమీప భవిష్యత్తులో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలపై దిశా నిర్దేశం చేశారు. 
 
 
విజయవాడలో ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైన హెచ్.సీ.యల్. టెక్నాలజీ ప్రస్ధానం ఇప్పటికి మూడు వేల ఉద్యోగులకు చేరుకుందని తెలిపారు. 2023 సంవత్సరాంతానికి ఆరు వేల ఉద్యోగులకు చేరుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ, బ్లిట్జ్ క్రీగ్ పోటీలు 2006 వ సంవత్సరం నుండి నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ వ్యాప్తి కారణంగా నిర్వహించలేదని ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలించటం వల్ల ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమం నిర్వహించినందుకు కంప్యూటర్ సైన్సు విభాగానికి అభినందనలు తెలియజేశారు. కళాశాల డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల మాట్లాడుతూ, విద్యార్థులకు ఇటువంటి సాంకేతిక పోటీల్లో పాల్గొనటం వల్ల తమలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం దొరుకుతుందని తద్వారా ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుందని తెలియజేశారు. కంప్యూటర్ సైన్సు విభాగాధిపతి డాక్టర్ రవికిరణ్ పోటీల్లో పాల్గొనటానికి విద్యార్ధులను ఉత్సాహపరిచిన వివిధ కళాశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
 
కంప్యూటర్ సైన్సు ఉప విభాగాధిపతి కావూరి శ్రీధర్ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలపై మాత్రమే కాకుండా ఇటువంటి పోటీల నిర్వహణలో భాగస్వాములవటం ద్వారా జీవన నైపుణ్యాల అభివృద్ధికి అవకాశం లభిస్తుందని తెలియచేశారు. అనంతరం పత్ర సమర్పణ, పోస్టర్ ప్రెజెంటేషన్, ఈ-క్రాఫ్ట్, టెక్నికల్ క్విజ్, నిధి అన్వేషణ, స్పాట్ ఫొటోగ్రఫీ, మిస్టర్ అండ్ మిస్ బ్లిట్జ్ క్రీగ్ వంటి పోటీలు నిర్వహించారు. పోటీలు ముగిసిన అనంతరం పి.బీ. సిద్ధార్థ కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు ఫ్యాషన్ షోతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ముగింపు సభలో కళాశాల పూర్వ విద్యార్థిని సివిల్ ప్రొసీజర్ కోడ్ జాయింట్ కమిషనర్ నూతలపాటి సౌమ్య ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్సు విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.