శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సీఎం జగన్ కేబినెట్ కూర్పుపై మంత్రి బొత్స మార్క్!

botsa
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఏర్పాటు చేసిన కొత్తమంత్రివర్గంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపించింది. రెండోసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారు, కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారిలో పలువురు బొత్స సత్తిబాబుకు అత్యంత సన్నిహితులు. అందుకే సీఎం జగన్ వారందరికీ మళ్లీ మంత్రిపదవులు కట్టబెట్టినట్టు సమాచారం. 
 
నిజానికి మంత్రివర్గంలోని అందర్నీ తప్పించి కొత్త వారిని ఎంపిక చేయాలని జగన్ తొలుత భావించారు. ఈ నిర్ణయంపై సీనియర్ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆక్షేపణనను తెలిపారు. దీంతో సీనియర్ ఒత్తిడికి తలొగ్గిన సీఎం జగన్ ఎట్టకేలకు పాత మంత్రివర్గంలోని 11 మందికి తిరిగి కొత్త జట్టులో స్థానం కల్పించారు. మరో 14 మందికి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 
 
కొత్త మంత్రివర్గంలో సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోమారు చోటు దక్కించుకున్నారు. వీరంతా తొలి నుంచి ఒక జట్టుగా కొనసాగుతున్నారు. రెండోసారి అవకాశం దక్కించుకున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తొలి నుంచీ బొత్సతో సన్నిహితంగా ఉంటున్నారు. 
 
కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్‌, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా కూడా బొత్సకు సన్నిహితంగా ఉంటారు. అందుకే వీరందరికీ సీఎం జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించినట్టు సమాచారం.