శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (09:07 IST)

మిర్చికి కరోనా దెబ్బ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. మిర్చినీ దెబ్బ కొట్టింది. మిర్చి రైతులనూ దడ పుట్టిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారస్తులు రైతును నిండా ముంచుతున్నారు.

రాత్రికి రాత్రి ధరను సగానికి తగ్గించారు. క్వింటా మిర్చి ధర రూ.22 వేల నుంచి ఒక్కసారిగా రూ.11వేలకు తగ్గించారు. అయితే వ్యాపారులు మాత్రం దేశీయంగా పంట భారీగా మార్కెట్లకు వస్తుండటం, ఇదే సమయంలో ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గాయని చెబుతున్నారు.

పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతును కరోనా వైరస్‌ పేరు చెప్పి...తక్కువకు భేరాలాడుతున్నారు. ఈ-నామ్‌ను సైతం సక్రమంగా అమలు చేయకపోవడం రైతులు నిండా మునుగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నోరు మొదపకపోవడం విశేషం.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు. మిర్చి ధరలను ఒకసారి పరిశీలిస్తే 2017నాటి వ్యాపారుల మాయాజాలం గుర్తుకొస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2017 మార్చి 31న వరంగల్‌ జిల్లా ఎనుమాముల, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో లక్షల సంఖ్యలో అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలను చూసి వ్యాపారులు, దళారులు ఏకమై క్వింటా మిర్చికి రూ.5వేలు తగ్గించిన విషయం విదితమే.

దాంతో ఆగ్రహించిన రైతులు రెండు జిల్లాల్లోని మార్కెట్లలోనూ మిర్చికి నిప్పుపెట్టి తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ఖమ్మం మార్కెట్‌లో ఆందోళనకు దిగారంటూ పదిమంది అన్నదాతలపై కేసులు మోపి వారి చేతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం మిర్చి రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొదట్లో భారీగా ధర ఉండటంతో...అప్పుల నుంచి గట్టెక్కి.. ఎంతో కొంత చేతిలో మిగులుతుందని ఆశించిన రైతుకు తిరిగి చేదు అనుభవమే ఎదురవుతోంది. పంట చేతికొచ్చి మార్కెట్‌ తీసుకెళ్లాక ధరలు అమాంతం తగ్గింస్తుండటంతో రైతులు నేల చూపులు చూడాల్సివస్తోంది.
 
ఖరీఫ్‌లో పంటను 2019 డిసెంబర్‌లో 20,993 క్వింటాళ్లు, 2020 జనవరిలో 79,294 క్వింటాళ్ల తేజ మొదటి రకం మిర్చిని రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు.

అదే సమయంలో డిసెంబర్‌లో 13,977 క్వింటాళ్లు, జనవరిలో 16,583 క్వింటాళ్ల తాలు రకం మిర్చిని కూడా అమ్మకానికి తీసుకొచ్చారు.

జనవరి ప్రారంభంలో అరకొరగా రైతులు పంట తెచ్చినప్పుడు క్వింటా రూ.21వేల నుంచి రూ.22వేల వరకూ ధర పలికింది. క్రమేపీ మార్కెట్‌కు మిర్చి రాక పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను రూ.22వేల నుంచి రూ.11వేలకు తగ్గించారు.