సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (21:08 IST)

రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి

రాష్ట్రంలో   ఇప్పటి వరకూ  ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని, ప్రపంచ  ఆరోగ్య సంస్థ హెల్త్  ఎమర్జెన్సీని ప్రకటించినందున పటిష్టమైన నియంత్రణా చర్యలు చేపట్టామని వైద్య  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్  కెఎస్ జవహర్ రెడ్డి  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విదేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘాతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు.  రాష్ట్ర స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్ ను  ఇప్పటికే ఏర్పాటు చేశామని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు  ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన 29 ప్రయాణికులపై  నిఘా పెట్టామని, వీరిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేవని వైద్యులు ధృవీకరించారని తెలిపారు.  వీరిలో  28 మంది ప్రయాణికులు   ఇళ్లల్లోనే ఉండేలా చర్యలు తీసుకున్నామని,  ఒకరిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని వివరించారు.

ప్రభుత్వ జనరల్  ఆసుపత్రులు, జిల్లా  ఆసుపత్రుల్లో  ఐసోలేషన్ వార్డుల్ని ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే 28 రోజుల పాటు తమ తమ ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి రావొద్దని సూచించారు.

కుటుంబ సభ్యులకు గానీ, ఇతరులకు గానీ దూరంగా ఉండాలని,  ఒకవేళ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్క్ ల కోసం  సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని,  ఇంకేమైనా  సహాయం కావాలంటే 24 గంటలూ అందుబాటులో ఉంటే స్టేట్ కంట్రోల్ సెంటర్( 0866 2410978) నంబరుకు గానీ, 1100, 1902 టోల్ ఫ్రీ నంబరుకు గానీ ఫోన్ చేయాలని సూచించారు.