మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (11:50 IST)

తెరాస సర్కారు పథకాలపై లక్ష్మీ నారాయణ ప్రశంసలు...

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోని సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మంచివని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవన్నారు. 
 
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు సాగునీరందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేసి.. నీటి నిల్వలను పెంచేలా మిషన్‌ కాకతీయ పథకం చేపట్టడం గొప్ప నిర్ణయమన్నారు. 
 
వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమని, సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ల ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారమంతా సత్యదూరమేననిని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.