శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (09:19 IST)

మొన్న హైకోర్టు.. నేడు కేంద్రం.. ఏపీ సర్కారుకు షాకులపై షాకులు!!

నిబంధనలకు విరుద్ధంగా జీవోలు జారీ చేస్తున్న వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తేరుకోలని షాకులిస్తోంది. ఇపుడు కేంద్రం వంతైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఓ జీవోను కూడా జారీ చేసింది. 
 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లేలా శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ నిర్ణయం తీసుకోగా, తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి తెరలేపింది. 
 
దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. పైగా, ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోక్యం చేసుకున్నారు. ఈ పథకంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చర్చించాలని, ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. 
 
ఈ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను పరిశీలించి, ప్రాజెక్టుల డీపీఆర్ నిబంధనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు.
 
అలాగే, ప్రాజెక్టును అడ్డుకోవాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించేంత వరకూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని కోరినట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు రాసిన లేఖలో షెకావత్ పేర్కొన్నారు. 
 
కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు కూడా ఆయన పేర్కొన్నారు.