శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (10:45 IST)

ఆంధ్రా - తెలంగాణాల మధ్య నీటి యుద్ధం!! జగన్ వర్సెస్ కేసీఆర్

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మళ్లీ మొదలైంది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం జారీ చేసి ఓ జీవోనే. 
 
కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు వీలుగా ఏపీ సర్కారు ఓ జీవో జారీచేసింది. దీనిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని... దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు.
 
ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని జగన్ చెబుతున్నారు. ఈ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లేందుకు కృష్ణా బోర్డు కూడా సమ్మతించదని గుర్తుచేశారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామని చెప్పారు.
 
శ్రీశైలం డ్యాములో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు కూడా మించి ఉండదని చెప్పారు. 
 
ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నీటి మట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లలేదని చెప్పారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్తుందని తెలిపారు.
 
దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. 
 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించేలా ఏపీ ప్రభుత్వం జీఓ తీసుకురావడం విభజన చట్టానికి విరుద్ధమని, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుని తప్పు చేశారని, ఈ విషయంలో తమను సంప్రదించకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. 
 
పైగా, ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 
 
అపెక్స్ కమిటీ నుంచి ఆమోదం పొందకుండానే ఏపీ ముందడుగు వేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టని, ఏ కొత్త నిర్మాణమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుతో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
గతంలో నెలకొన్న విభేదాలను, వివాదాలను పక్కనబెట్టి నదీ జలాలను వాడుకుందామని తాను స్నేహహస్తం అందించానని, భేషజాలు లేకుండా తాను చొరవ చూపితే, తమను సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాధను కలిగించిందని కేసీఆర్ అన్నారు. 
 
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. నదిలో నీటి వాటాలను తేల్చడంలో ట్రైబ్యునల్ లో జాప్యం జరుగుతోందని గుర్తు చేసిన ఆయన, సత్వర న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని కేసీఆర్ అధికారులతో వ్యాఖ్యానించారు.