గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (10:27 IST)

కరోనా హైరానా : మరో 3 వేల కేసులు - తెలంగాణాలో మళ్లీ వేగం

దేశంలో కరోనా వైరస్ హైరానా ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా మరో 3 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,415కి చేరింది.
 
ఇక గత 24 గంటల్లో దేశంలో 3,525 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 74,281కి చేరింది. అలాగే, కరోనా నుంచి 24,386  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 47,480 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విశ్వరూపాన్ని చూపుతున్నాయి. మంగళవారం కూడా కొత్తగా 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఇపుడు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఈ 31 మందిలో 14 మంది వలస కూలీలు ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో 1326 కరోనా కేసులు నమోదైవుండగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 32 మంది చనిపోయారు.