బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (10:26 IST)

లాక్డౌన్ రూల్స్ బ్రేక్ : బీజేపీ అధ్యక్షుడిపై తెలంగాణ పోలీసుల కేసు

తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. 
 
లాక్‌డౌన్ నిబంధనల్లో భాగమైన భౌతిక దూరాన్ని పాటించకపోవడమే కాకుండా, అనేక మంది అనుచరులను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు చేసిన పోలీసులు.. ఆయనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆయనతోపాటు మరికొందరు నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
కాగా, మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటించారు. జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, బత్తాయి దిగుబడి సరిపడా లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే బత్తాయిలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.
 
ఆ సమయంలో బండి సంజయ్‌తో పాటు.. ఆయన అనుచరులు లాక్డౌన్ రూల్స్, సామాజిక భౌతికదూరం నిబంధనలను గాలికి వదిలివేశారని ఆరోపిస్తూ, పెద్దవూర పోలీసులు బీజేపీ నేతలపై 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.