కేంద్రం డ్రామాలు, రాష్ట్ర ఎంపీల రాజకీయాలు... ఇకనైనా కట్టిపట్టండి!
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంటు వేదికగా ఎంపీలు పోరాటం చేయాలని సీపీఐ రామకృష్ణ హితవు పలికారు. చేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు రాజకీయాలు మాని బాధ్యత తీసుకోవాలని హితవుపలికారు. గంగవరం పోర్ట్ ప్రైవేటుకు అప్పచెప్పడం సిగ్గుచేటన్నారు. మంత్రి బొత్స సత్యన్నారాయణ అవాస్తవాలు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజలను మాయ చేసినట్లు బొత్స అందరనీ మాయ చేయలేరని వ్యాఖ్యానించారు. కమీషన్‌లకు కక్కుర్తి పడి గంగవరం పోర్ట్‌ను తక్కువకే అప్పగించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రధాని మోడీ ఆమోదం తీసుకున్నాకే, జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించారని చెప్పారు. రైతులను అవమానించేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ఒప్పందాలను ఈ ప్రభుత్వం గౌరవించదా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళుతున్నా మోడీ స్పందించరన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎపీలో ఆరు రూపాయలు ఎక్కువ ధర ఉందన్నారు.
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ధర్నా చేసిన సమయంలో వదిలేసి మరో ఊరిలో అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహంతో పని చేస్తున్నారని రామకృష్ణ అన్నారు.