శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 7 ఏప్రియల్ 2022 (23:55 IST)

చేనేత సంఘాలను తనిఖీ చేసిన చదలవాడ నాగరాణి

Apco
డిమాండ్‌కు అనుగుణమైన వస్త్రాలను ఉత్పత్తి చేయటం ద్వారా నేత కార్మికులు జీవన ప్రమాణ స్దాయిని పెంచుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకులు చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం విజయవాడ సమీపంలోని పలు చేనేత సంఘాలను నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రుణాలు మంజూరు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 
చేనేత రంగంలో నూతనత్వాన్ని సాధించే క్రమంలో కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని, ఈ క్రమంలో సంఘాలకు అవసరమైన రుణాలు అందించేందుకు బ్యాంకులు సైతం ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. తొలుత గూడురు మండలం మల్లవోలు గ్రామంలోని చేనేత క్లస్టర్, చౌడేశ్వరీ చేనేత సహకార సంఘాన్ని పరిశీలించిన నాగరాణి, ఇక్కడ కేటాయించిన నిధులు, వ్యయం వంటి అంశాలపై దృష్టి సారించారు.

 
అనంతరం కప్పలదొడ్డి ప్రాంతంలోని బాలభాస్కరా చేనేత సంఘాన్ని సందర్శించి అక్కడి కార్మికులతో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. పెడన పట్టణంలోని గాంధీ చేనేత సహకార సంఘంను సందర్శించిన చదలవాడ చేనేత రంగానికి పూర్వపు శోభ తీసుకువచ్చే క్రమంలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు నాగేశ్వరరావు, ఉప సంచాలకులు ధనుంజయరావు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి రఘునందనరావు పాల్గొన్నారు.