గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (14:21 IST)

జగన్ నాటకాలను తిప్పికొట్టండి: చంద్రబాబు

ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశం వచ్చినా జగన్‌ను వదిలిపెట్టడం లేదు. ఫారమ్ 7 దుర్వినియోగం విషయంలో మొదట వైసీపీ వాళ్లు టీడీపీపైన ఫిర్యాదులు చేయగా ఇప్పుడు అదే కేసును వారి మెడకు చుట్టుకునేలా చేయడంలో చంద్రబాబు విజయం సాధించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
 
తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఫారమ్ 7 దుర్వినియోగంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు జగనే తన ఓటు తొలగించే ప్రయత్నం జరిగిందంటూ నాటకాలాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు జగన్ ఇలాంటి నాటకాలు ఇంకెన్నో ఆడతాడని, వాటిని కార్యకర్తలే తిప్పికొడతారని చెప్పారు.
 
వైసీపీ వాళ్లు ఎన్ని రకాలుగా టీడీపీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా అది వాళ్లకే నష్టం కలిగిస్తుందని ఆయన చెప్పారు. లబ్దిదారులే ప్రభుత్వం తరపున ప్రచారం చేస్తారని ధీమా వ్యక్తం చేసారు. వాస్తవ పరిస్థితులపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీకి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని ఆయన చెప్పారు.