ఏపీలో ఆగని రాజకీయ రక్త చరిత్ర... వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం
ఏపీలో రాజకీయ రక్త చరిత్ర ఆగట్లేదు. పల్నాడు జిల్లాలో టీడీపీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్ళినప్పుడు.. గొడ్డళ్లతో దాడి చేసిన దుండగులు.. వెన్న బాలకొటిరెడ్డి చనిపోయాడని వదలివెల్లినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెన్న బాలకోటి రెడ్డిని గుర్తించిన ఆయన బంధువులు హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.
వెన్న బాలకోటిరెడ్డి మాజీ రొంపిచర్ల అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయనపై దాడి చేసింది ఎవరు? దాడికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలే అని ఆరోపిస్తున్నారు.
ఈ దాడి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ఈ దాడిలో వైసీపీ ఎంపీపీ భర్తే పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హత్యకు కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. కోటిరెడ్డిపై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహించారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.