శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 నవంబరు 2018 (16:24 IST)

మాకు సీఎం చంద్రబాబు చేసిన ఆ పని జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? ఎవరు?

అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి ముస్లింలకు పది క్యాబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చారని, రాజకీయ అవకాశాల విషయంలో ఇదో సువర్ణాధ్యాయం అని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.డి.హిదాయత్ సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొనియాడారు. సీనియర్ ప్రజాప్రతినిధులు ఎన్.ఎం.డీ.ఫరూక్‌కు మంత్రి పదవి, శాసన మండలి ఛైర్మన్‌గా ఎం.ఏ.షరీఫ్‌లను నియమించడంతోపాటు, ఒకరికి ప్రభుత్వ విప్, ఏడుగురు ముస్లింలకు కార్పొరేషన్ పదవులు, ఇద్దరిని మేయర్లుగా, ఒకరికి జడ్పీఛైర్మన్ పదవి కల్పించడం, ముస్లింలందరికీ దక్కిన గౌరవం అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మైనారిటీ వర్గాలు సుఖంగా ఉండటం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా అని హిదాయత్ ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముస్లింలకు జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని వైసీపి నేతలకు హిదాయత్ సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ముస్లిం కార్పొరేషన్లకు కనీసం ఛైర్మన్లను కూడా నియమించలేదని, కడప, హైదరాబాద్‌లలో వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నారని ఆయన విమర్శించారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన బావమరిది కడపలో వక్ఫ్ భూములు ఆక్రమించి పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు నిర్మించుకున్నారని హిదాయత్ ధ్వజమెత్తారు. వైఎస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని ఆయన విమర్శించారు.
 
ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా పోరాడుతున్నారని హిదాయత్ కొనియాడారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ఆ ప్రభావం మైనారిటీలపై పడకుండా, నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో మైనారిటీల కోసం రూ.2800 కోట్లు కేటాయించి ఖర్చు చేశారని, ఈ ఆర్ధిక సంవత్సరంలోనే మరో రూ.1100 కోట్లు కేటాయించడం చరిత్రలో ఎన్నడూ లేదని హిదాయత్ గుర్తుచేశారు. టీడీపీ పాలన మైనారిటీల పాలిట స్వర్ణయుగం అన్నారు. 
 
గతంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా ఉన్నాయని, ముస్లిం సమాజం మొత్తం టీడీపీతోనే పయనించాలని నిర్ణయించిందని హిదాయత్ అభిప్రాయపడ్డారు. సీఎంగా మరలా చంద్రబాబు నాయుడు రావాలని ముస్లింలు కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.