బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (12:31 IST)

చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. తన గురించి దేశం మొత్తం తెలుసు...

skill development case
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఆయనకు కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడగించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును వర్చువల్ విధానంలో కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడగిస్తున్నట్టు ఏసీబీ కోర్టు జడ్డి తెలిపారు. 
 
ఈ విచారణ సందర్బంగా మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. అలాగే, మీకు విధించిన రిమాండ్‌ను శిక్షగా భావించొద్దని చెప్పారు. జైల్లో మీకు ఇబ్బందేమైనా కలుగుతోందా? అని ప్రశ్నించారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, నేరం నిరూపణ కాలేదని, దర్యాప్తులో అన్నీ తేలుతాయని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. మరోవైపు, జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై పూర్తి వివరాలను ఇవ్వాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిస్తూ, తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్టు చేశారని తెలిపారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్టు చేశారని, తన అరెస్టు అక్రమమన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 
 
తన తప్పు ఉంటే విచారించి, అరెస్టు చేయాల్సిందన్నారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. తనను జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. 73 యేళ్ల వయసులో పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
సీబీఐ కస్టడీపై మీ అభిప్రాయం చెప్పాలని చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు. న్యాయం గెలవాలని, చట్టం ముందు అందరూ సమానవేనని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను న్యాయమూర్తి నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన పనిలేదన్నారు. మరోవైపు, చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.