శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2024 (11:22 IST)

సరికొత్త చరిత్రను సృష్టించిన టీమిండియా : బాబు - పవన్ శుభాకాంక్షలు

Chandrababu Naidu
భారత క్రికెట్ జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నెగ్గడం ద్వారా భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించిందని వారు కొనియాడారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేస్తూ, కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నాను. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను సాకారం చేశారు. దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తినందుకు కృతజ్ఞతలు అంటూ టీమిండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
 
విశ్వ విజేతలకు అభినందనలు అంటూ టీమిండియా విజయం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. "రెండవసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదేస్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ జనసేనాని తన ప్రకటనలో పేర్కొన్నారు.
 
టీమిండియా కళ్లు చెదిరే విజయం సాధించిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ కితాబిచ్చారు. రోహిత్ శర్మ, అతడి జట్టు సభ్యులు 13 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించారని కొనియాడారు. నా వరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ వల్లే మ్యాచ్ గెలిచాం అనిపించింది... చివరి ఓవర్లో తీవ్ర ఒత్తిడిలోనూ సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఆ క్యాచ్ అద్భుతం అని లోకేశ్ ప్రశంసించారు. కుర్రాళ్లూ... మీ విజయం పట్ల దేశం గర్విస్తోంది... అంటూ ట్వీట్ చేశారు.
 
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా టీమిండియా వరల్డ్ చాంపియన్లుగా అవతరించడం పట్ల స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ స్పందించారు. మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి... ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణాలు... జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు.