మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (18:55 IST)

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా? : చంద్రబాబు - జిల్లా ఎస్పీ సీరియస్

న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతులను అరెస్టు చేయడమే కాకుండా వారి చేతులకు బేడీలు వేసిన ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మరో అప్రదిష్ట మూటగట్టారని చెప్పారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత 17 నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవని విమర్శించారు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారని ప్రశ్నించారు. 
 
'మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు. తాను అమ్మని ధాన్యానికి డబ్బులు తనకొద్దు అన్న నిజాయితీకి వేధింపులు' అని చంద్రబాబు చెప్పారు.
 
'ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా..? పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా?' అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్లు చేశారు.
 
'అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్టగొట్టడానికా మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లావేళ్లా పడి అడిగి తీసుకుంది..? ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా?' అని నిలదీశారు.
 
'ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం' అని చంద్రబాబు గుర్తుచేసారు.
 
‘గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుంది. రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి, ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
 
ఎస్పీ సీరియస్.. ఆరుగురు సస్పెండ్ 
మరోవైపు, రైతులకు బేడీలు వేసిన ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేశారు. ఆర్ఎస్ఐ, ఆర్ఐలకు చార్జ్ మెమో ఇచ్చారు. 
 
అంతేకాకుండా అడిషనల్ ఎస్పీతో విచారణ కమిటీని నియమించారు. రాజధాని రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెంకు చెందిన రాజధాని రైతులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
 
అయితే రైతులకు బేడీలు వేయడంపై అమరావతి పరిరక్షణ సమితి, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎస్పీ విశాల్ గున్ని చర్యలకు ఉపక్రమించారు. 
 
రైతులకు బేడీలు వేసి.. జిల్లా జైలుకు తరలించేందుకు ఎస్కార్ట్‌గా వచ్చిన ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేస్తూ.. దీనిపై కమిటీని నియమిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.