శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (16:32 IST)

నా ఇంటిని ముంచేందుకు లంక గ్రామాలను ముంచారు : చంద్రబాబు

పైనుంచి వరద నీటితో తన ఇంటిని ముంచాలని కుట్రపన్నిన వైకాపా మంత్రుల కల నెరవేరకపోగా వందలాది లంక గ్రామాలను వరద నీటిలో ముంచారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన శుక్రవారం కృష్ణానది వరదలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వచ్చిన వరదల్ని చాలా జాగ్రత్తగా నియంత్రించే అవకాశమున్నా ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌‌ చేయలేకపోయారని ఆరోపించారు. ఐదారు లక్షల క్యూసెక్కుల నీటిని మేనేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదన్నారు. ఆగస్టు 7 వరకూ రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదని విమర్శించారు. 
 
కృష్ణా వరదలు ప్రకృతి సృష్టించినవి కావని, ప్రభుత్వం సృష్టించిన వరదలని ఆయన ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం లేకపోలేదన్నారు. వరదలపై వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని, రాజధాని ముంపునకు గురవుతుందని చెప్పడానికే ఇదంతా చేస్తోందని, రాజధానిని వేరే చోటుకు తరలించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో ప్రజలకు తీవ్రనష్టం జరిగిందని ఆరోపించారు. వరదలతో వాణిజ్య పంటలన్నీ నష్టపోయాయన్నారు. రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు.. దాహం తీర్చుకునేందుకు బాధితుల దగ్గర కిన్లే వాటర్‌ అడిగారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వరద బాధితులు భోజనం అడిగితే ఆధార్‌ అడగటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
 
గతంలో గోదావరిలో 35 లక్షల క్యూసెక్కులు వస్తే ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేశామని, ఇప్పుడు 15లక్షల క్యూసెక్కులు వస్తే మేనేజ్‌ చేయలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తప్పుడు విధానాలు ఎందుకు అవలంభించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ప్రభుత్వం సృష్టించిన వరదలు కాబట్టి రైతులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. వరద బాధితులకు నెల రేషన్‌ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలన్నారు. పొలాల్లో 0ఇసుక, బురద తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో విష జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.