వాళ్లకు ఆమాత్రం తెలియదా? గోరంట్ల బుచ్చయ్య
రాష్ట్రంలో వరద పరిస్థితి, రైతుల సమస్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు అయితే 4 టీఎంసీల వరకు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఒక్కసారిగా వరద ప్రవాహాన్ని దిగువకు వదిలితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియదా? అని ప్రశ్నించారు. దాదాపు 220 టీఎంసీల నీరు వృథాగా పోయిందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.
అంతకుముందు కృష్ణానది వరద ఉద్ధృతికి ముంపు బారిన పడిన ప్రాంతాలను తెదేపా నేతల బృందం పరిశీలించింది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారితో వారు మాట్లాడారు. కృష్ణానదికి దిగువన ఉన్న ప్రాంత ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయకపోవడం వల్లే భారీగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. 15 రోజుల ముందు నుంచే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కృష్ణానది వరద గురించి హెచ్చరికలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదని వాపోయారు.
బాధిత కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని తెదేపా నేతలు హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నష్టం అంచనా వేయాలని డిమాండ్ చేశారు. పరిహారాన్ని మొక్కుబడిగా ఇవ్వాలనుకోవడం సరికాదని, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే పూర్తిగా నీట మునిగిన నివాసాలకు కనీసం రూ.25 వేల వరకు అందించాలని డిమాండ్ చేశారు.