ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (07:38 IST)

ఎస్ఈసీని మార్చడం అనైతికం: గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్, ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తొలగింపు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఈ-మెయిల్ ద్వారా లేఖ రాశారు. రాజ్యాంగంలో 243 (కె) నిబంధన ప్రకారం 2016లో ఎస్ఈసీని నియమించారని, ఐదేళ్ల కాలవ్యవధికి నియమితులైన ఆయనను ఇప్పుడు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌ను దొడ్డిదారిన మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

అర్ధాంతరంగా ఎస్ఈసీని మార్చడం అనైతికం, చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిశాకే అమలు చేయాలని, తాజా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
 
విపత్కర సంక్షోభంలోనూ రాజకీయ ప్రయోజనాలా?
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై శ్రద్ద పెట్టకుండా ఈ విపత్కర సంక్షోభంలో కూడా రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టడం భావ్యం కాదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై సర్వే చేయడం తగదని ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో తీర్మానించిన 15అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

అనేక చోట్ల జేసీబీలతో ఇళ్ల స్థలాలు చదును చేయడం, యూనివర్సిటీల పాలకమండళ్ల నియామకంలో ఒకే సామాజికవర్గం వారిని పెద్ద ఎత్తున నియమించడం సరికాదన్నారు. ఏపీలో కరోనా స్వల్పకాలంలోనే మూడో దశకు చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు.

మొదటి, రెండో దశలోనే వైరస్‌ వ్యాప్తిని నిరోధించి వుంటే ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులే చెబుతున్నారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మొదటి నుంచి కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు.

ప్రభుత్వంలోని వివిధశాఖల అధికారులతో, నిపుణులతో చర్చించి రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా సరైన నిర్ణయాలు సత్వరమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా విపత్తు దృష్ట్యా లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కోరారు.

విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని సూచించారు.  కరోనా బాధితులకు సేవలందిస్తూ మృతిచెందిన ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ కేంద్రం ప్రకటించిందని, దానితో పాటు కరోనా సోకి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25లక్షల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఒక వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌, గ్రావెల్‌ తవ్వకాలు, ఇసుక, మట్టిని వందలాది లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు.

అన్ని చోట్లా దొంగచాటుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, నాయకులను నిందించడం మానుకోవాలని కోరారు.