ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:38 IST)

ఏపి గవర్నర్ వినూత్న నిర్ణయం...విచక్షణ అధికారాల సద్వినియోగం

కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు తన జీతంలో సంవత్సరం పాటు 30 శాతం కోతకు ఇప్పటికే ముందుకు రాగా, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర ప్రధమ పౌరునిగా తనకున్న విచక్షణ అధికారాలను సద్వినియోగపరుస్తూ రూ.30 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సమకూర్చారు. రాజ్‌భవన్ బడ్జెట్‌కు సంబంధించి నిధుల వినియోగంలో గవర్నర్‌కు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి.

ఈ మేరకు గవర్నర్ తర‌పున రాజ్‌భవన్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపడుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలకు అర్ధిక పరమైన వెసులుబాటు కోసం రాష్ట్ర రాజ్యాంగ అధినేత ఈ చర్యలకు ఉపక్రమించారు.

రూ.30 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి సమకూర్చిన తరుణంలో ఆ మేరకు రాజ్‌భవన్‌లో పొదుపు చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనాను గవర్నర్ ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల రాజ్‌భవన్‌లకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని, స్వయంగా తన ఖర్చులను తగ్గించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తిదాయకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.