బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:08 IST)

ఏపీలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా

ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షలకు వాయిదా వేసినట్టు వెల్లడించింది.

పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలో చేసిన ఏర్పాట్లన్నీ లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడకక్కడే నిలిచిపోయాయి. ఈ కారణంగా నిర్ణీత తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఉన్నత విద్యామండలి పేర్కొంది.

పరీక్షల వాయిదాకు కారణాలివీ..
► లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలన్నీ కొంతకాలంగా పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో ఎన్ని కంప్యూటర్లు పనిచేస్తాయో తెలీని పరిస్థితి.
► ముఖ్యంగా పవర్‌ బ్యాక్‌ అప్‌ ఉందో లేదో గుర్తించాలి. ఎన్ని పనిచేస్తున్నాయో పరిశీలించాకే ఆయా కేంద్రాల్లో పరీక్షలకు హాల్‌ టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది.
► ఇలాంటి సమస్యలను సర్ధుబాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఉన్నత విద్యామండలికి టీసీఎస్‌ విన్నవించింది.
► తొలుత మార్చి 29 వరకు ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు తుది గడువు విధించగా.. ఏప్రిల్‌ 5 వరకు పొడిగించారు.
► లాక్‌డౌన్‌ విధించడంతో దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 17 వరకు పొడిగించక తప్పలేదు. తొలుత ఈ నెల 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ పరీక్షలకు షెడ్యూల్‌ ఇచ్చారు.
► ఇప్పటికీ సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు ఎంసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంది.
► ఈ దృష్ట్యా సెట్లను నిరవధికంగా వాయిదా వేసి పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్‌ జారీ చేస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.