దిశ నిందితులకు జైలులో మటన్ కూరతో భోజనం... తండోపతండాలుగా వస్తున్న జనం

ఠాగూర్| Last Updated: సోమవారం, 2 డిశెంబరు 2019 (15:39 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని పోలీసులు జైలుకు తరలించారు.

ఈ నలుగురు కామాంధులకు ఆదివారం మొదటి రోజు. దీంతో వారికి ఉదయం పూట పులిహోరను అల్పాహారంగా జైలు సిబ్బంది అందించారు. అయితే, జైలు నిబంధనల మేరకు ఆదివారాల్లో ఖైదీలకు మాంసాహారాన్ని వడ్డిస్తారు. దీంతో రాత్రి దిశ నిందితులకు కూడా మాంసం కూరను వడ్డించగా, వారు మిగిలిన ఖైదీల్లాగే మాంసం కూరతో భోజనం ఆరగించారు. ఈ నలుగురు భోజనం చేసేసమయంలో ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా భోజనం చేసినట్టు జైలు వర్గాల సమాచారం.

ఇదిలావుంటే, దిశను అత్యాచారం చేసిన ప్రాంతాన్ని చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో దిశను అత్యాచారం చేసి చంపేసిన కామాంధులు.. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి లారీలో మరో ప్రాంతానికి తరలించారు. అయితే, అత్యాచారం జరిపిన ప్రాంతాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. బాధిత యువతికి జరిగిన ఘోరాన్ని తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త దూరంలో ఉన్న రోడ్డుపైకి వచ్చినా ఇంత ఘోరం జరిగేది కాదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

జాతీయ రహదారి, రింగ్ రోడ్డుపై రాకపోకలు జరిపే వారిలో మెజార్టీ ప్రజలు ఘటనా స్థలి వద్ద కాసేపైనా ఆగి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాహనాల రద్దీ, జనసంచారం ఉన్న చోట ఇంతటి ఘోరం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కాల్చివేయాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.దీనిపై మరింత చదవండి :