గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 7 మార్చి 2022 (22:50 IST)

ముఖ్యమంత్రి దృష్టికి పెదపాలపర్రు, కోడూరు గ్రామాల ఇబ్బందులు: మంత్రులు పేర్నినాని, కొడాలి నాని

జిల్లాల పునర్విభజన పరంగా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు, కోడూరు గ్రామాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని రాష్ట్ర రవాణా, పౌర సరఫరాల శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం ముదినపల్లి మండలంలో ఉన్న ఈ రెండు గ్రామాలను గుడివాడ రూరల్ మండలంలో కలిపి, కృష్ణా జిల్లాలో కొనసాగించే విషయంపై గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న విధంగా రాష్ట్ర కమిటీలో చర్చిస్తామన్నారు.

 
సోమవారం పెదపాలపర్రు, కోడూరు గ్రామాలకు చెందిన అఖిలపక్ష నేతలు వెలగపూడి సచివాలయంలో మంత్రులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోడూరు అఖిలపక్షనేత సజ్జా వెంకట్రామయ్య చౌదరి (నాని) సమస్యను వివరిస్తూ ప్రతిపాదిత జిల్లాలను యధాతధంగా ఆమోదిస్తే మా గ్రామం పరిపాలనా సౌలభ్య రహితంగా మారుతుందని వాపోయారు. పెదపాలపర్రు, కోడూరు గ్రామాలకు ప్రస్తుతం ఉన్న రెవిన్యూ డివిజన్ ముఖ్యకేంద్రం గుడివాడ కాగా, ఇది తమ గ్రామాలకు ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉందని, జిల్లా కేంద్రం మచిలీపట్నం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు.

 
కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న తమ గ్రామాన్ని ఏలూరు జిల్లాగా ప్రతిపాదించటం వల్ల  రెవిన్యూ డివిజన్ ముఖ్య కేంద్రం కాని, జిల్లా కేంద్రం కాని దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరుకు మారుతుందన్నారు. నాటి మండలాల పునర్ విభజన అనాలోచితంగా సాగిందని,  గుడివాడకు అతి సమీపంలో ఉన్న పెదపాలపర్రు, కోడూరు గ్రామాలను గుడివాడ రూరల్ మండలంలో కాక, ముదినేపల్లిలో చేర్చారన్నారు.

 
పెదపాలపర్రు సరిహద్దులు పంచుకున్న మోటూరు, కల్వపూడి అగ్రహారం, పర్నాస గ్రామాలు గుడివాడ రూరల్  మండలంలో ఉండగా, గుడివాడ నుండి ముదినేపల్లి మార్గంలో ఉన్న ఈ గ్రామాలు పాలపర్రుతో పోల్చితే గుడివాడ పట్టణానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ గ్రామాలను దత్తత తీసుకున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలు గుడివాడ పట్టణంలోనూ, గుడివాడ రూరల్ మండలం మోటూరులో ఉన్నాయని సజ్జా వెంకట్రామయ్య చౌదరి (నాని) వివరించారు.  గ్రామాలకు చెందిన రైతుల బ్యాంకు ఖాతాలు పూర్తిగా గుడివాడ పట్టణంలోని కెడిసిసిబి బ్యాంకులో ఉండగా, సబ్ రిజిస్టార్ కార్యాలయం సైతం తమకు గుడివాడే కేటాయించబడి ఉందన్నారు.

 
గ్రామస్తుల వైద్య అవసరాలకు సైతం 5 కిలోమీటర్ల దూరంలో గుడివాడే కీలకమన్నారు. గ్రామస్ధులకు గుడివాడ రూరల్ మండలం దొండపాడు, పాత చవటపల్లి, మోటూరు, గుడ్లవల్లేరు మండలం చంద్రాల, విన్నకోట గ్రామాలలో సైతం వ్యవసాయ భూమలు ఉండగా, జిల్లా మార్పు ఫలితంగా ఆస్తులు ఒక జిల్లాలో నివాసం మరోక జిల్లాలో అవుతుందని మంత్రులకు వివరించారు. ప్రతిపాదిత ఏలూరు జిల్లాలో గ్రామస్డులు నివాసం కాగా, పిల్లలు గుడివాడలో విద్యాభ్యాసం చేస్తారని, వారి ధృవీకరణ పత్రాలలో కృష్ణా  జిల్లాగా నమోదు అవుతుందని, కాని తల్లి దండ్రులు ఏలూరు జిల్లాలో ఉంటారన్నారు.

 
పొట్ట చేతపట్టుకుని విభిన్న అవసరాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లినప్పుడు ఇది సమస్యగా మారుతుందని, ఉద్యోగ అవకాశాల పరంగా కృష్ణా, ఏలూరు జిల్లాలు రెండు జోన్ల పరిధిలో ఉంటే  తమ పరిస్ధితి దారుణమన్నారు. గ్రామస్థుల ఇబ్బందులను సానుకూలంగా విన్న పేర్ని, కొడాలి ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలని నిర్ణయించిందని, ఒకటి రెండు గ్రామాల కోసం విధానపరమైన నిర్ణయంలో మార్పు తీసుకురావాలంటే అది ఉన్నతస్ధాయిలోనే సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామస్థుల ఆందోళనను ప్రణాళికా శాఖ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోడూరు గ్రామ సర్పంచ్ అడుసుమిల్లి కృష్ణ కుమారి వెంకట్రావు, ఉపసర్పంచ్ వల్లభనేని శేషుబాబు, పెదపాలపర్రు నేతలు పాల్గొన్నారు.