సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (14:17 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావకు మంగళం...

ragijava
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న రాగి జావను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒంటిపూట బడుల సాగుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాగి జావ స్థానంలో చిక్కీలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్య క్రమం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసింది. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్నప్పటికీ పంపిణీ నిలిపివేయాలంటూ మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్ నిధి మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాగి జావకు బదు లుగా చిక్కీలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల పనివేళల్లో చేసిన మార్పుల కారణంగా దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
అయితే సవరించిన పనివేళలతో పంపిణీకి వచ్చిన ఇబ్బందేమిటో ఆ ఉత్తర్వుల్లో వివరించలేదు. ఈ ఏడాది మార్చి 21న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మంగళ, గురు, శనివారాల్లో పంపిణీ మొదలుపెట్టారు. ఇంతలోనే ఈ ఏడాదికి ఇక చాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మాత్రం దానికి ఇంత హడావిడిగా ఎందుకు ప్రారంభించడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.