అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు... నవ వరుడు మృతి
చిత్తూరు జిల్లా సోమర మండలం దేవలకుప్పం యానాదివాడలో ఓ విషాద ఘటన జరిగింది. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఒక నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘటన జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన గంగాధరం, సిద్ధప్ప, ఈశ్వరయ్య ముగ్గురూ కలిసి గొర్రెలను మేత కోసం మంగళవారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొన్ని గొర్రెలు కనిపించకపోవడంతో తిరిగి అడవిలో వాటిని వెతికేందుకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో గంగాధర్ (20) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గంగాధర్‌ను కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప (30)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సదుం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. కాగా, మృతుడు గంగాధర్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. గంగాధర్ మృతి వార్త తెలిసి భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంతో విషాదఛాయలు అలముకున్నాయి.
ఢిల్లీలో దారుణం.. అసహజ శృంగారానికి ఒత్తిడి చేసిన యువకుడి హత్య
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అసహజ శృంగారానికి అంగీకరించాలంటూ ఒత్తిడి చేసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జనవరి 19వ తేదీ ఢిల్లీలోని మోరీ గేటు దగ్గరలోని డీడీఏ పార్క్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఘటనాస్థలికి పోలీసులు వెళ్లి పరిశీలించగా.. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత విచారణలో భాగంగా, స్థానికంగా ఉన్న 50 సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు. శుక్లా కోయా మండిలోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. నైట్ షెల్టర్‌లో ఉంటున్నాడు.
ఫుటేజీలో శుక్లాతో పాటు రాజేశ్ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించాడు. దీంతో అతడిని బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా విషయం బయటకు వచ్చింది. తనను శుక్లా అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్రణాళిక వేసుకుని హత్య చేసినట్లు రాజేశ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. తలపై బండ రాయితో మోది హత్య చేసినట్టు చెప్పారు.