శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 16 డిశెంబరు 2021 (12:34 IST)

సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్ల‌కు అప్ప‌గించిన హైకోర్ట్

ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తీసుకుంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ధరల ప్రతిపాదనలను థియేటర్ల యాజమాన్యాలు జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలని సూచించింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
 
 
సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వివాదం న‌డుస్తోంది. సినిమా టిక్కెట్లు ధ‌ర‌లు ఎలా ప‌డితే, అలా పెంచ‌కూడ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం జీవో 35 తీసుకొచ్చింది. దీనిపై ఎగ్జిబిట‌ర్లు హైకోర్టుకు వెళ్ళారు. కాగా, సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్‌ జడ్జి రద్దు చేశారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా, కోర్టు ఈ తాజా ఆదేశాలిచ్చింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను సంబంధిత జాయింట్ క‌లెక్ట‌ర్లు నియంత్రిస్తార‌ని, తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.