శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (16:46 IST)

స్వచ్ఛభారత్, క్లీన్ ఏపీ పేరుతో ప్రజలపై చెత్త పన్ను భారం

కేంద్ర ప్రభుత్వానికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో 750 కోట్ల రూపాయల చెత్త పన్ను భారం వేసింద‌ని సీపీఎం నిర‌స‌న తెలిపింది. విజయవాడ నగరపాలక సంస్థ లో బలవంతపు వసూళ్లు, ప్రతిఘటిస్తున్న ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.
 
 
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో చెత్త పన్నుకు వ్యతిరేకంగా జరిగిన సభలలో, ఆందోళనలలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ .బాబూరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ రావు మాట్లాడుతూ, నగరపాలక సంస్థ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించినందుకు ప్రజలకు   చెత్త పన్నును కానుకగా ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు.
 
 
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను వ్యాపార సంస్థలుగా ప్రభుత్వాలు మార్చేశాయ‌ని, మంచి నీరు, డ్రైనేజీ, చెత్త అన్ని మౌలిక సదుపాయాలను వ్యాపార సరుకులుగా ప్రభుత్వాలు చూడటం శోచనీయం అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, సేవలు ప్రభుత్వాలు, స్థానిక సంస్థల బాధ్యత అని, రాజ్యాంగ విరుద్ధంగా చెత్త పన్ను వసూలు చేయటం అక్రమం అని తెలిపారు.
 
 
విజయవాడతో  సహా పట్టణాలు మురికి కూపాలుగా మారాయని,  దోమలు చెండాడుకు తింటున్నాయి. విష జ్వరాలు విజృంభించాయి, ప్రజారోగ్యం దెబ్బతింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై దృష్టి పెట్టకుండా  వసూళ్లలో అత్యుత్సాహం చూపిస్తున్నారని, సచివాలయాలు ప్రజా సేవా కేంద్రాలుగా కాకుండా పన్ను వసూలు చేసే కేంద్రాలుగా మార్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. పెన్ష‌న్లు, సంక్షేమ పథకాల నుండి చెత్త పన్ను కోత పెట్టి బలవంతంగా వాలంటీర్లు వసూలు చేయటం సిగ్గుచేటన్నారు. విజయవాడ, నగరాలు, పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు  వేయడానికి కూడా ఎవరూ సిద్ధం కావడం లేదన్నారు. 
 
 
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులను తన అవసరాలకు వినియోగించుకుంటున్నద‌ని, కేంద్రంలోనీ మోడీ ప్రభుత్వం  షరతులకు లొంగి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నద‌ని వివ‌రించారు.   ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పై పన్ను, యూజర్ చార్జీలు కేంద్రం యొక్క షరతుల ఫలితమేన‌న్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం ప్రజల మీద పన్ను భారాలు వేయడం గర్హనీయమ‌న్నారు.


చరిత్రలో ఏనాడు లేని చెత్త పన్ను ఎందుకు చెల్లించాలి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. పలుచోట్ల చెత్త పన్ను చెల్లించబోమని ప్రతిఘటిస్తున్నారు. చెత్తబుట్టలు ఎరగా చూపి పన్నులు వసూలు చేయటం సిగ్గుచేటు. రాబోయే నెలల్లో ఆస్తి ఆధారితంగా ఇంటిపన్ను పెంచుతూ నోటీసులు జారీ చేయటానికి రంగం సిద్ధమవుతోంది. ప్రజల పై దాడి చేయడానికి ఒకొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. వీటిని తిప్పికొట్టాలి. చెత్త పన్ను వసూలు ఎదుర్కోండి, ప్రతిఘటించండి. అని బాబూరావు పేర్కొన్నారు.