గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (12:06 IST)

గులకరాయి దాడి ఘటన : సీఎం జగన్ భద్రత కట్టుదిట్టం

ys jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి జరిగింది. దీంతో ఆయన చేపట్టిన బస్సు యాత్రకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని సీఎం కాన్వాయ్‌కు జత చేసింది. సీఎం భద్రత పెంచేందుకు అధికారులు అనేక అదనపు చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి ప్రయాణమార్గాన్ని సెక్టర్లుగా విభజించిన అధికారులు, ఒక్కో సెక్టర్‌కు డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో నిఘా ఏర్పాటు చేశారు. గజమాలలు, పువ్వులు విసరడంపైనా ఆంక్షలు విధించారు.
 
మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటరులో పలు అత్యాధునిక వ్యవస్థలను జోడించారు. ప్రయాణమార్గాన్ని 360 కవర్ చేసేలా వాహనానికి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ సాంకేతికతో అనుమతి లేని డ్రోన్లను గుర్తించే వ్యవస్థను కూడా వాహనంలో ఏర్పాటుచేశారు. వీటిని అదనంగా డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. గతంలో ఇలాంటి వాహనాలను వినియోగించినప్పటికీ రాయిదాడి నేపథ్యంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించేందు అధికార యంత్రాంగం సిద్ధమైంది. 
 
పటిష్ట నిఘా కోసం డ్రోన్ కెమెరాల సంఖ్యను పెంచింది. భారీ భవంతులు, సెల్వర్లు, బ్రిడ్జిలపై ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని డ్రోన్లతో నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన సమయాల్లో పోలీసులు తక్షణం స్పందించేలా వ్యవస్థను రెడీ చేశారు. ఇక డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల నుంచి వచ్చే ఫుటేజీని మొబైల్ కమాండర్ సిబ్బంది నిత్యం పరిశీలిస్తుంటారు.
 
ఇకపోతే శుక్రవారం జగన్ యాత్ర ఎస్టీ రాజపురం నుంచి ప్రారంభంకానుంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్ల కోట బైపాస్ మీదుగా యాత్ర సాగనుంది. సాయంత్రం కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు, కత్తిపూడి, పాయకరావు పేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ చేరుకుంటారు. రాత్రి సీఎం అక్కడ బస చేయనున్నారు.