బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (14:31 IST)

తుది జాబితా కోసం సీఎం జగన్ కసరత్తులు... తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు - ఎంపీలు

jagan
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లి ప్యాలెస్‍‌కు క్యూకట్టారు. ఇలా వచ్చిన వారిలో అనేక మంది తమ సీటు ఉంటుందా? ఊడుతుందా? అని సీఎంను అడిగి తెలుసుకున్నారు. కొందరికి ఆయన హామీ ఇవ్వగా, మరికొందరికి మాత్రం చిరునవ్వుతో సమాధానం చెప్పి పంపించినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న సీఎం జగన్.. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం సరైన అభ్యర్థులను ఎంపిక చేసే పనుల్లో ఆయన నిమగ్నమైవున్నారు. పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జులు (సమన్వయకర్తలు) మారుస్తూ ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో వైకాపా ఐదో జాబితా విడుదలకానుంది. 
 
ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్ నుంచి పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, నేతలకు పిలుపు వచ్చింది. సీఎంవోకు వచ్చిన వారిలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబులు సీఎంవోకు వచ్చిన వారిలో ఉన్నారు. 
 
అయితే, సీఎంవో నుంచి వచ్చిన పిలుపు మేరకు వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు భారీగా తరలివచ్చారు. సమన్వయకర్తల మార్పులపై సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఎడతెగగని చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి తదితరులు ఉన్నారు.