గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (18:14 IST)

జనవరి 1న గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌... పెన్ష‌న్ల పెంపు!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 1న పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని, ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండగలా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని హెలిప్యాడ్‌ స్థలాన్ని, వాహనాల పార్కింగ్, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లతో కలిసి ఆమె పరిశీలించారు. 
 
 
అనంతరం హోంమంత్రి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే  కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నారని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్తిపాడులో నిర్వహించడం, దీనికి సీఎం విచ్చేయనుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 
 
కలెక్టర్ వివేక్ యాద‌వ్ మాట్లాడుతూ, ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. 
 
 
కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ (రెవెన్యూ,రైతుభరోసా) ఎ.ఎస్‌. దినేష్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ (సచివాలయాలు, అభివృద్ధి) పి.రాజకుమారి, సంయుక్త కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం), కె.శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవిసుకన్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యాస్మిన్‌  పాల్గొన్నారు. 
 
 
జనవరి 1న జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ వివరాలను సీఎంఓ ఖరారు చేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం కార్యాలయం నుంచి బయలుదేరి 10.35 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 10.55 గంటలకు ప్రత్తిపాడు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55 గంటల నుంచి 11.10 గంటల వరకు ప్రత్తిపాడులో స్థానిక ప్రజాప్రతినిధులతో ముచ్చటిస్తారు. 11.11 గంటలకు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శిస్తారు. 11.15 గంటల నుంచి 12.30 గంటల వరకు ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో పెన్షనర్లకు నగదు అందజేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభా స్థలి నుంచి హెలిప్యాడ్‌కు  చేరుకుని 12.55 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన 2.30 గంటలపాటు సాగనుంది.