పెన్షన్లపై ఆరు నెలలకు ఓసారి ఆడిటింగ్ జరగాలి : సీఎం జగన్
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లపై ప్రతి ఆకు నెలలకు ఒకసారి ఆడిటింగ్ జరపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. పెన్షన్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన తమ పార్టీ నేతలను కోరారు.
అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2,79,069 మందికి రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం బటన్ నొక్కి పింఛనుదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిటింగ్ జరగాలన్నారు. ఇపుడు కూడా ఆడిటింగ్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారంటూ విపక్ష నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు, పార్టీ నేతలు తిప్పికొట్టాలి అని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఉండగా, ఇపుడు అది రూ.1770 కోట్లకు చేరిందన్నారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇవ్వగా ఇపుడు ఆ సంఖ్య 62 లక్షలకు చేరిందని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు.