శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (16:08 IST)

విశాఖపట్టణం నుంచే పాలన సాగిస్తాం : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

ambani - jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోమారు పాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్టణం నుంచి రాష్ట్ర పాలన సాగుతుందని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. విశాఖ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే విశాఖ నుంచి పరిపాలనను సాగిస్తామని తెలిపారు. 
 
ఎగుమతుల పరంగా, ఉపాధి అవాకాశాలపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఏపీలోని పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏపీలో రాష్ట్రంలో 340 కంపెనీలు, 20 రంగాల్లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.
 
ఈ సదస్సు ప్రారంభమైన మొదటి రోజే ఏకంగా 92 కంపెనీలో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో అనేక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. విశాఖ నగరం పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు విశాఖ చిరునామాగా ఉందన్నారు. సుదీర్ఘమైన తీరప్రాంతం కలిగిన విశాఖ నుంచే త్వరలో పరిపాలనను కొనసాగిస్తామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.