శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (20:52 IST)

మతం పేరుతో కుట్ర : మంత్రి బొత్స‌

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడమే బాధ్యతగా, విధిగా భావించి పనిచేయాలని ఆదేశించారని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమాత్యులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

సోమవారం అనంతపురం రూరల్ మండలం పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, పివి.సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స మాట్లాడుతూ ముందుగా ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ పెద్ద పండుగ అయిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో 1628 మందికి 38 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,549 మందికి ఇంటి స్థలాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1100 గ్రామాలు ఉంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద కొత్తగా 1045 నగరాలు, నగర పంచాయతీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారన్నారు.
 
ఎన్నికల మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతల భావిస్తూ, మేనిఫెస్టో లోని ప్రతి అంశాన్ని నెరవేర్చడమే మన ధ్యేయం అని సీఎం అన్నారని, చెప్పినట్లు గానే ఇళ్ల పట్టాలిస్తున్నామన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తున్నామని, స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఇచ్చిన మాటను నెరవేర్చి పేదల సొంతింటి కలను తీర్చిన ముఖ్యమంత్రి ఒక్క వైయస్ జగన్ తప్ప ఎవరు లేరన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూశామని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకున్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం అమలు చేస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయో అలాంటి కార్యక్రమాలను సీఎం చేస్తున్నారన్నారు. 
 
నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద 2, 3 సంవత్సరాల్లో జిల్లాలో 1045  కొత్త ఊర్లను ఏర్పాటు చేస్తున్నాం : 
నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద 2, 3 సంవత్సరాల్లో జిల్లాలో 1045 కొత్త ఊర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతరలా, పండుగలా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, నిరుపేద లో గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోయేలా ఇంటి నిర్మాణాలు చేపడతామన్నారు.

నిరుపేదలకు ఇంటి పట్టాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ఇస్తున్నామని, అదనంగా రూ.60  వేలతో రోడ్లు, కాలువలు, వాటర్ ట్యాంకులు, ఆసుపత్రులు, గుడి, బడి, నీటి సౌకర్యం తదితర అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణం కోసం వాలంటీర్ ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం కల్పించిన మూడు అంశాలలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని ఇల్లు కట్టుకోవచ్చని, ఇంటి నిర్మాణం కోసం ముడిసరకు కావాలంటే ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, లేదా మేము పెట్టుకోలేము ప్రభుత్వమే కట్టి ఇవ్వాలని అడిగినా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఇంటి పట్టాల తో పాటు 1.11 లక్షల మందికి ఇంటి నిర్మాణం కి సంబంధించి శాంక్షన్ ఇచ్చామని, మిగతా ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మంజూరు చేస్తామన్నారు. ప్రజలంతా ఒకే కులం, మతం, వర్గం అని, అందరూ కలిసి ఉండాలని లాటరీ తీసి ఇంటిగ్రేటెడ్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సామాన్యులకు మంచి జరగాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టా తో పాటు సరిహద్దులు తెలియజేసి, అధికారుల సంతకం, పూర్తి వివరాలు, డి ఫారం పట్టా ఇస్తున్నామని, త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు.
 
పేదలకు ఏంకావాలో, పిల్లా పాపలతో చల్లగా ఉండాలంటే ఏం కావాలో, పేదల జీవన విధానం మారడానికి ఏం కావాలో అలాంటి మహత్తరమైన సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందన్నారు. గత వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది తల్లులకు 15 వేల రూపాయలు చొప్పున జగనన్న అమ్మ ఒడి పథకం కింద వారి ఖాతాలలో జమ చేశామని, వారంతా ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారని, లెక్కపెట్టలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 
 
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దారిద్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం వేల కోట్ల రూపాయల తో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతో వెనకబడిందని, జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి జిల్లాకు హంద్రీనీవా నీరు తీసుకురావాలని ఎంతో కృషి చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు త్వరలోనే  అందబోతున్నాయన్నారు.

జిల్లాకు ప్రధానమైన నీటి సమస్య కూడా తొలగిస్తామని, జిల్లాకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా నా ప్రభుత్వ పథకాల అమలులో, అభివృద్ధి పనుల్లో ఎదురైన సమస్యలను చూసి పారిపోకుండా పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, గోపురాలపై కొందరు దాడులు చేస్తున్నారని, దానివల్ల గందరగోళ సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై బురద జిల్లాలను చూస్తున్నారని, ప్రజలకు లేనిపోని అపోహలు సృష్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 
 
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తప్పకుండా ప్రారంభిస్తాం :
 అనంతపురం నగరంలో త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని తప్పకుండా ప్రారంభించి పూర్తి చేస్తామని మంత్రి బొత్స అన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైందని, బయో మైనింగ్ కు సంబంధించి రెండు రోజుల్లో జీవో వస్తుందన్నారు. అనంత నగర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఏడి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పి వి ఎన్ఎన్ మూర్తి, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మీ నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.