శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (20:31 IST)

మాస్క్‌ మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. వైరస్‌ వ్యాపించకుండా రక్షణ కోసం మాస్కులు ధరించడం నిత్యకృత్యమైంది. దీంతో వాడి పడేసిన మాస్కుల గుట్టలు పేరుకుపోతున్నాయి.

2020 లెక్కల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 1.87 కోట్ల మంది జనాభా ఉన్నారు. వంద మందిలో కనీసం ముగ్గురు ప్రతి రోజు ఒక్క మాస్క్‌ను వాడిపడేస్తే ఆ వ్యర్థాలతో రోజుకొక ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ను నింపవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

కేవలం ఆరోగ్య కార్యకర్తలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు 20 నుంచి 30 లక్షల మాస్కులను ప్రతి రోజు వారు వినియోగిస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 
 
మరోవైపు మాస్క్‌ల వ్యర్థాలు పేరుకుపోవడంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అవి పూర్తిగా మట్టిలో కలిసేందుకు  సుమారు 50 ఏండ్లు పడుతుందని చెబుతున్నారు.

సాధారణంగా మాస్క్‌ను పాలీప్రొఫైలిన్, రబ్బరుతో తయారు చేస్తారని పేర్కొన్నారు. పాలీప్రొఫైలిన్ పొర డీకంపోజ్‌ కావడానికి దాదాపు 20-30 సంవత్సరాలు, రబ్బర్‌ బ్యాండ్‌ పూర్తిగా ఉనికిని కోల్పోవటానికి 50 సంవత్సరాలు పడుతుందని వెల్లడించారు.

దీంతో మాస్క్‌ మొత్తం మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాస్క్‌ వ్యర్థాల నిర్వహణపై అన్ని దేశాలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.