సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (10:27 IST)

రోజాను చూస్తే తుర్రుమని పారిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎందుకబ్బా?

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాను చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు ఆమడదూరం పారిపోతున్నారు. స్వయంగా ఆమె వచ్చి పలుకరించినా ముక్తసరిగా మాట్లాడుతున్నారేగానీ, ఇంతకుముందులా మనస్సు విప్పి మాట్లాడేందుకు జంకుతున్నార

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాను చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు ఆమడదూరం పారిపోతున్నారు. స్వయంగా ఆమె వచ్చి పలుకరించినా ముక్తసరిగా మాట్లాడుతున్నారేగానీ, ఇంతకుముందులా మనస్సు విప్పి మాట్లాడేందుకు జంకుతున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన ఓ సంఘటన ఇందుకు అద్దంపడుతోంది. 
 
అధికార టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. యథావిధిగా ఆయన వెనుక రెండు, మూడు వాహనాల్లో ఆయన అనుచరులు విమానాశ్రయానికి వచ్చారు. వాహనం దిగి ఎయిర్ పోర్టు లాంజ్‌లోకి వెళ్లిన ఆయనకు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తారసపడ్డారు. అంతే.. ఒక్కసారిగా ఖంగుతిన్న వంశీ... తన అనుచరులతో కలసి నాలుగు అడుగులు వెనక్కి వేశారు. 
 
అప్పటికీ రోజా ఆయన వైపే వెళ్లారు. ఈ విషయం గమనించిన వంశీ... తన అనుచరులతో మాట్లాడుతూనే ఆయన ఎయిర్ పోర్టు బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని గమనించి రోజా అక్కడే ఆగిపోయారట. ఆ తర్వాత ప్రయాణం కోసం బోర్డింగ్ జరిగిపోయింది. వంశీ ఫ్లైట్‌లోకి ఎక్కారు. 
 
ఈ సందర్భంగా ఆయనను చూసిన రోజా, "ఏంటి వంశీగారు, తప్పించుకుని తిరుగుతున్నారు?" అంటూ నవ్వుతూ ప్రశ్నించారట. దీనికి సమాధానంగా, "ఏం లేదు మేడమ్. అనుచరులు ఉన్నారు కదా.. వారితో మాట్లాడుతున్నాను" అని చెప్పారట. 
 
ఇంతకూ సంగతి ఏమిటంటే... రోజాతో ఏదైనా మాట్లాడితే... ఆ విషయం బయటకు పొక్కితే... ఆ తర్వాత ఆ సంగతి అధినేతకు తెలిస్తే... ఏమవుతుందో అనే భయంతోనే వంశీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దాదాపు టీడీపీ నేతల పరిస్థితి అంతా ఇలాగే ఉందని అంటున్నారు. అంటే రోజాను చూస్తే ఆమడదూరం పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట.