సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (10:08 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. ప్రజల నిర్లక్ష్యమే కారణమా..?

తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. టూ స్టేట్స్‌లోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపయింది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్‌ కోరలు చాస్తోంది. మరో 2 నెలలపాటు ఈ దూకుడు కొనసాగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఏపీలో ఒక్కరోజే 2 వేల 765 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు 490, కృష్ణా 341, విశాఖపట్నం జిల్లాలో 335 చొప్పున కేసులు రికార్డయ్యాయి. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,752కి చేరింది. 
 
కరోనా బారి నుంచి నిన్న 584 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,04,548కి చేరింది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 487 కేసులు నమోదయ్యాయి.