1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (16:17 IST)

ఏపీలో కోవిడ్ 19 అత్యవసర పాస్.. చెక్ పోస్టుల వద్ద స్కానింగ్

వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన అదేశాలు చేయగా, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కోవిడ్ -19 అత్యవసర పాస్ ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తారు. 

వ్యవసాయ, సహకార (MKTG II) విభాగం 26.03.2020 తేదీన జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి,  సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులే.  పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు అయినందున కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు,  షరతులకు లోబడి మంజూరు చేస్తారు. ఈ పాస్ ల కోసం కరోనా వ్యాధి నివారణ సేవలలో ఉన్న వారంతా దరఖాస్తు చేయనవసరం లేదు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుండి 11 వరకు) అవసరమైన వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, తదనుగుణ వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్ తో పని లేదు.

మరోవైపు పాస్ పొందేందుకు సైతం ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరం లేదని దీనిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి , చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా తెలిపారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేయవఛ్చని, https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (https://www.spandana.ap.gov.in/) ద్వారా  కూడా పాస్ పొందగలుగుతారన్నారు. జిల్లా కంట్రోల్ సెంటర్ ఛైర్మన్,  సంయిక్త కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి ఆమోదము, తిరస్కరించే అధికారం కలిగి ఉంటారన్నారు.
 
నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్ ను ప్రత్యేక  QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్ కు పంపుతామని, వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని వివరించారు.  చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందిస్తామని, తద్వారా పోలీసు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు.

భధ్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న హిమాన్హు శుక్లా ఈ పాస్ కు పాస్లో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉందని,  చెక్ పోస్టులలోని పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక,  అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం ఉందని హిమాన్హు శుక్లా వివరించారు. 

ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదన్నారు. పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు  తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు పిర్యాధు చేస్తే అవి జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి వెళతాయన్నారు.