తిరుమలకు వచ్చే భక్తులు మాస్కులు లేకుండా కనబడ్డారో అంతే...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలలో కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు పోలీసులు సిద్థమయ్యారు. థర్డ్ వేవ్ అంటూ ప్రచారం జరుగుతుండడం.. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆందోళన మొదలవుతోంది.
ప్రారంభ దశ నుంచి కోవిడ్‌ను ఎదుర్కొంటే కేసుల సంఖ్య బాగా తగ్గించవచ్చన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా ఆలయాల దగ్గర ప్రత్యేక దృష్టి పెడుతోంది. అధికసంఖ్యలో భక్తులు ఆలయాలకు వస్తుండడంతో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తేనే వైరస్ బారిన పడకుండా భక్తులు ఉంటారని భావిస్తున్నారు.
అందులో భాగంగా టిటిడి ముందడుగు వేస్తోంది. తిరుమలలో ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించాలని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాస్కులు ధరించని వారిపై కోవిడ్ నిబంధనలు అనుసరించి జరిమానా వేస్తామని హెచ్చరించారు.
అలాగే ఉద్యోగులు, దుకాణాదారులు, స్థానికులు, భక్తులు మాస్కులు ధరించని పక్షంలో చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. స్వామివారి దర్సనాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్పీ విజ్ఙప్తి చేశారు.
టిటిడి అఫిషియల్ వెబ్ సైట్ లోనే భక్తులు టిక్కెట్లు పొందాలన్నారు. విఐపి దర్సనాలు కల్పిస్తామని భక్తులను నమ్మించే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని బంగారు ఆభరణాలు దొంగిలించే నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
నిందితుడి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అడిషనల్ ఎస్పీ తెలిపారు. భక్తులను మోసగించే దళారులపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.