కరోనావైరస్, చెన్నై అపోలో ఆసుపత్రికి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శించారు. వయసురీత్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జగన్ సలహా మేరకు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి ఆసుపత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ వున్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే భూమన కరుణాకర్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం తిరుపతిలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన మృతదేహాలను స్వయంగా శ్మశానంలో పూడ్చిపెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇపుడు మరోమారు ఈ వైరస్ బారినపడ్డారు.
ఆగస్టులో తొలిసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.