శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (11:00 IST)

ఏపీలో ప్రతి కుటుంబానికి 90 రోజుల్లో కోవిడ్‌ పరీక్షలు: జగన్‌

కోవిడ్‌ నివారణ తదుపరి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయనుంది. వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు.

దీని కోసం 104 వాహనాలను వినియోగించుకోవాలని, అనుమానం ఉన్న వారి నుంచి కోవిడ్‌ శాంపిల్‌ తీసుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, వారికి అక్కడే మందులు కూడా ఇవ్వాలన్నారు.

దీనికి అనుగుణంగా 104లో సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. స్క్రీనింగ్, పరీక్షలు చేసిన తర్వాత వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్య కార్డులో పొందుపర్చాలన్నారు. పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
 
రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి హాజరయ్యారు. 
 
రోజుకు 24 వేలకుపైగా టెస్టులు నిర్వహిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని చెప్పారు. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 60 సంవత్సరాలు పైబడ్డ వారిని, అలాగే 40 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టెస్టుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

మరణాల రేటు తగ్గించేందుకు ఈ వ్యూహాన్ని ఎంపిక చేసుకున్నామన్నారు. చేస్తున్న పరీక్షల్లో కనీసం 60 శాతం పరీక్షలు వారికే చేస్తున్నామని, ఆ తర్వాత కంటైన్‌మెంట్‌ జోన్లలో, హైరిస్క్‌ ఉన్న గ్రూపుల ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, మాల్స్, టెంపుల్స్, మార్కెట్‌ యార్డ్స్‌ తదితర కేటగిరీల్లో ర్యాండమ్‌గా టెస్టులు చేస్తున్నామన్నారు.

బయట నుంచి కార్మికులు రావడం, ట్రక్కులు ద్వారా వేరే ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన వారు తదితర అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ విస్తరించిన ప్రాంతాలను అధికారులు సీఎంకు వివరించారు. 
 
ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థల ద్వారానే కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం ద్వారా దీన్ని అడ్డుకోగలమన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యంగా రానున్న 90 రోజుల్లో పని చేయాలన్నారు.

ప్రతి మండలానికీ ఒక 104 వాహనాన్ని అందించి, కరోనా నిర్ధారణ కోసం శాంపిళ్లు సేకరించే సదుపాయాలను వాహనంలో అమర్చాలన్నారు. వీటితో పాటు షుగర్, బీపీ లాంటి పరీక్షలు కూడా చేయాలన్నారు. అవసరమనుకున్న వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్‌ చేయాలన్నారు. 104 సిబ్బందితో పాటు అదే గ్రామానికి చెందిన ఏఎన్‌ఎంలను, ఆశావర్కర్లను, వాలంటీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా ప్రతి గ్రామానికి 104 వెళ్లి ఈ తరహా సేవలందించాలన్నారు. 
 
రాష్ట్రంలో 1.42 కోట్ల ఆరోగ్య కార్డుల్లో 1.20 కోట్ల పంపిణీ పూర్తి చేశామని అధికారులు చెప్పారు. మిగిలిన వాటిని కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. వాటి పంపిణీ పూర్తయ్యాక.. ప్రతి మనిషి ఆరోగ్య వివరాలు, స్క్రీనింగ్‌ వివరాలను  ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. 
 
అలాగే కోవిడ్‌ పరీక్షలు చేయడంలో కూడా స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం అన్నారు. హేతబద్ధత ఉండాలని సూచించారు. చేసే పరీక్షల్లో 50 శాతం కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలోనూ, మిగిలిన యాభై శాతంలో తమకు తాముగా కోవిడ్‌ పరీక్షల కోసం ముందుకు వచ్చే వారికి, అలాగే కాల్‌ సెంటర్‌ ద్వారా సమాచారం ఇచ్చే వారికి పరీక్షలు చేయాలన్నారు. అలాగే వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న హైరిస్క్‌ ఉన్న రంగాలు, గ్రూపుల్లో కూడా పరీక్షలు చేయాలని సీఎం చెప్పారు. 
 
ప్రజల్లో భయాందోళనలు (స్టిగ్మా) తొలగించేలా అవగాహన, చైతన్యం కల్పించాలన్నారు. ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఇది వరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలన్నారు. స్థానికంగానే ఏం చేయాలన్న దానిపై లోకల్‌ ప్రోటోకాల్‌ రూపొందించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు దీని గురించి సవివరంగా తెలియజేయాలని, ఏ నంబర్‌కు కాల్‌ చేయాలో చెప్పాలన్నారు.

కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే పాటించాల్సిన ఎస్‌ఓపీపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 90 రోజుల్లోగా ప్రతి ఇంటికీ అవగాహన కల్పించడం, స్క్రీనింగ్‌ చేయడం, పరీక్షలు చేయడం పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం చాలా వరకు పీహెచ్‌సీల్లో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉన్నా, ఈ సదుపాయాన్ని అన్ని పీహెచ్‌సీల్లో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. 
 
కరోనా ఉన్నట్టుగా అనిపిస్తే.. ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్‌ పెట్టి అందులో వివరాలు ఉంచాలని ఆదేశించారు. కాల్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు హోర్డింగ్‌లో పెట్టాలని సీఎం ఆదేశించారు. 
 
కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రాంతాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలన్నారు. కేçసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు  సమీపంలో ప్రాంతాల్లో టెస్టింగ్‌ సదుపాయం, మెడికేషన్‌ అందుబాటులో ఉంచాలన్నారు. శానిటేషన్‌పైన కూడా దృష్టి పెట్టాలన్నారు.
 
పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్లాన్‌ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లో డాక్టర్, స్టాఫ్‌ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తప్పనిసరిగా ఉండాలని, వార్డుల్లో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లర్లు అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌కు అనుసంధానంగా ఉండాలన్నారు. 
 
వర్షా కాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి, ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖలో కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌పై సీఎం ఆరా తీశారు. మనుషులకైనా, పశువులకైనా, ఆక్వా రంగంలో వినియోగించే ఔషధాలకైనా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. 104, 108 కొత్త వాహనాలను జులై 1నాటికి సిద్ధం చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.