శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (18:05 IST)

కరోనా ఎఫెక్ట్.. ఈసారికి జగన్నాథ రథయాత్ర లేనట్లే!

ఒడిశాలో ప్రతి ఏడాది నిర్వహించే పూరి జగన్నాథ రథయాత్రపై కరోనా ఎఫెక్ట్ చూపింది. దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురు చూసే ఈ రథయాత్ర ఈసారికి లేనట్లేనని తేలిపోయింది. కరోనా నేపథ్యంలో.. జగన్నాధుని రధయాత్ర, అనుబంద కార్యకపాలపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఈ యాత్ర జూన్‌ 23న జరగాల్సి వుంది. అయితే ప్రజల భద్రత, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది రధయాత్రను నిలిపివేయాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

అయితే ఈ వేడుకపై నిషేధాన్ని విధించవద్దని, బదులుగా తక్కువ మంది ప్రజలను అనుమతించడం ద్వారా వేడుకలు జరిపేందుకు అనుమతించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు.

ఏదైనా మతపరమైన కార్యకలాపాలకు అనుమతిస్తే అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారన్న విషయం మాకు అనుభవ పూర్వకంగా తెలుసునని, ఈ విషయంలో జగన్నాధుడు మమ్మల్ని క్షమిస్తాడని బాబ్డే వ్యాఖ్యానించారు.