సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (13:38 IST)

మారిటోరియంపై సుప్రీం.. వడ్డీ మీద వడ్డీ తీసుకుంటారా? వడ్డీని రద్దు చేయలేరా?

కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగులు తీసుకున్న రుణాలుపై మారటోరియంతో వడ్డీపై వడ్డీ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పేర్కొంది. మారటోరియం నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పునఃసమీక్షించాలని సూచించింది. 
 
ఆరు నెలల మారటోరియం వ్యవధిలో వడ్డీపై వడ్డీ విధించడాన్ని ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని గత శుక్రవారం విచారణ జరిగింది. ఆ తర్వాత కేంద్రం, ఆర్బీఐ చర్చించి ఓ నిర్ణయానికి రావాలని చెప్పి, బుధవారం విచారణ జరిపింది.
 
కేంద్రం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వడ్డీని పూర్తిగా రద్దు చేయడం బ్యాంకులకు సాధ్యం కాదన్నారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే బ్యాంకింగ్ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. అయితే బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై ప్రకటించిన మారటోరియం విధానంతో ప్రయోజనం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 
ఇది వడ్డీమీద వడ్డీ విధింపులా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విధానంలో ఔచిత్యం ఏదీ కనబడటం లేదని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. 
 
ఈ స్కీంని పునఃసమీక్షించాలని కేంద్రం, ఆర్బీఐలకు సూచించింది. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్రత్యేకంగా సూచించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారాన్ని బ్యాంకులకు పూర్తిగా వదిలేయరాదని అభిప్రాయపడింది. ఇది కస్టమర్‌కు, బ్యాంకులకు మధ్య వ్యవహారమని కేంద్రం చెప్పడం కుదరదని పేర్కొంది. 
 
ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని ఒకటి మారటోరియం కాలంలో అసలు వడ్డీ విధించకపోవడం ఒకటి, వడ్డీ మీద వడ్డీ విధింపు విధించకపోవడం రెండోది అని అభిప్రాయపడింది. మొత్తం వడ్డీ రద్దు కాకపోయినా, వడ్డీమీద వడ్డీని అయినా తొలగించాలని చెప్పింది.
 
ఇక వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులపై ఎంత భారం పడుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కావాలని బ్యాంకులు కోరాయి. బ్యాంకులు సమయం అడగడంతో కేసును ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఆ లోపు మారటోరియంపై కొత్త నిబంధనలు తీసుకు వచ్చే అవకాశం ఉందా అనేది అధ్యయనం చేయాలని బ్యాంకులకు సూచించింది.