శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:52 IST)

యనమలకు రూ.2వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చింది?: సీపీఐ నారాయణ ప్రశ్న

ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలక నేత - తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ ఎస్ తో టీడీపీ కుమ్మక్కైందనే సంకేతాలు రావడంతోనే రేవంత్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొత్తు విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఖండించకపోవడంతో రేవంత్ కలత చెందినట్లు సమాచారం.
 
కేసీఆర్‌ను ఎదిరించే సత్తా ఉన్న నాయకుడిగా పేరొందిన రేవంత్‌కు ఆ పొత్తు ఇబ్బందికరంగా మారిందని వినికిడి. ఈ నేపథ్యంలో నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యనమలకు కేసీఆర్ 2వేల కోట్ల కాంట్రాక్టు ఇప్పించారని - అందువల్లే కేసీఆర్‌పై యనమల ఈగ కూడా వాలనివ్వడం లేదని ఎద్దేవా చేశారు. తమను జైల్లో పెట్టించిన కేసీఆర్‌కు ఏపీ నేతలు అంత మర్యాద చెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 
 
ఇలా ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు. 
 
అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటుంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏపీలోని కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
 
పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నారాయణ ఆరోపణలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు వ్యతిరేకమని, ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. తాను సిద్దమని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విస్తరణకు వ్యతిరేకంగా వారు ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు.