1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (15:07 IST)

సినిమా టిక్కెట్ల ధరలపై ఉన్న శ్రద్ధ ఇసుక, సిమెంటుపై లేదెందుకు?

ఎపీ ప్రభుత్వానికి సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై ఉన్న శ్రద్ధ, అధిక ధరల తగ్గింపుపై లేదెందుకని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. తక్షణమే ఎపీలో ఇసుక , సిమెంటు, స్టీల్ ధరలు తగ్గించి భవన నిర్మాణ రంగాన్నిఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
 
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్ప‌డింద‌ని, పలు విధానాల అమలు సాకుగా చూపి గతంలో ఉచితంగా ఇచ్చే ఇసుక ధర మూడింతలు పెంచి వసూలు చేస్తున్నార‌ని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నర ఏళ్ళ కాలంలో భవన నిర్మాణ రంగం కుదేలైంద‌ని, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలకు తోడు కరోనా విపత్తు కారణంగా భవన నిర్మాణ కార్మికుల జీవన స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన పలు విభాగాలకు చెందిన దాదాపు 30 లక్షల మందికిపైగా ఉపాధి కరువైంద‌ని తెలిపారు.  
 
 
సిమెంటు బస్తాకు రూ.30 చొప్పున మళ్లీ పెంచార‌ని, ఇతర కంపెనీల సిమెంటు బస్తా ధర రూ.300-350కి చేరగా, భారతి, అల్ట్రాటెక్ లాంటి కంపెనీల సిమెంటు బస్తా ధర అధికంగా రూ.380 కి చేరుకుంది. ఇప్పటికే ఇసుక, ఇటుక, స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టి, ఇతర పన్నులు గుదిబండగా మారాయి. భవన నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలతో భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.


సొంతిల్లు సమకూర్చుకుందామనుకనే సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి కలగానే మిగిలింది. జగన్ సర్కార్కు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ధ సిమెంటు, ఇసుక, స్టీల్ ధరలు; పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో లేదెందుకు? అని రామ‌కృష్ణ ప్రశ్నించారు. అధిక ధరలు తగ్గించకుండా, కార్మికులకు ఉపాధి చూపకుండా, కేవలం రూ.5 లకే సినీ వినోదాన్ని అందిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ వికృత పాలనకు పరాకాష్ఠ అని విమ‌ర్శించారు.